రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పట్టణంలో మహిళలు, విద్యార్థినుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రొద్దుటూరు శాఖ నాయకులు పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగ కీర్తనను కలిసి మహిళల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీజే నాయకులు మాట్లాడుతూ, ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు యువకుల వల్ల విద్యార్థినులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలను వేధించడం, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు ఆందోళనకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్ కేసులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీజే ప్రతినిధులు కోరారు. విద్యార్థులకు మహిళల పట్ల గౌరవం, భద్రతపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
కళాశాలలకు వచ్చే విద్యార్థినుల భద్రత కోసం కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఎంపీజే నాయకులు సూచించారు. దీంతో విద్యార్థినులు, మహిళలు భయాందోళనల నుంచి బయటపడతారని అభిప్రాయపడ్డారు.
మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేసి, అవసరమైన సహాయం పొందాలని ఎంపీజే నాయకులు సూచించారు. మహిళల భద్రతకు సంబంధించి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మరింత బలోపేతం చేయాలని కోరారు.
వినతిపత్రంపై ఎస్సై నాగ కీర్తన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీజే నాయకులు తెలిపారు. అనంతరం ఎస్సై నాగ కీర్తనను ఎంపీజే ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే రాయలసీమ ఇన్చార్జ్ డా. ఎం.డి. అయూబ్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ భాష, కార్యదర్శి రఫీక్, సభ్యులు ముక్తియార్, ఎస్.ఎం. లాల్ బాషా, అల్లా బకాష్, నూర్, సోహెల్, ఫరాన్ తదితరులు పాల్గొన్నారు.













