రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
కడపలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం
కడప జిల్లా: సామాజిక పరిరక్షకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, కడప జిల్లా ఇన్చార్జి అలవలపాడు నరసింహులు మాదిగ సూచనలతో కడప జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యవర్గ సమావేశం ప్రొద్దుటూరు వినాయక కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గడ్డం నరసింహులు మాదిగ ఆధ్వర్యం వహించారు.
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగాల మునిస్వామి మాదిగ రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు, మారణకాండలపై వివరంగా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాదిగలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, మాదిగలపై జరుగుతున్న వివిధ రకాల దుష్ట చర్యలు ఆగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే అక్టోబర్ 5న ప్రొద్దుటూరు నియోజకవర్గానికి విచ్చేయనున్న ముఖ్యమంత్రికి తమ విన్నపాలు తెలియజేయడానికి మాదిగ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

జిల్లా ఇన్చార్జి అలవలపాడు నరసింహులు మాదిగ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాదిగలకు సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి సహా అనేక రంగాల్లో అండగా ఉంటానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తాను కూడా పెద్ద మాదిగనని అప్పట్లో చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు రాష్ట్రంలో మాదిగలపై జరుగుతున్న హత్యలు, మారణకాండలను చూస్తూ మౌనంగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాలపై స్పందించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. హోం మంత్రిగా ఉన్న మాదిగ నాయకుడు, మాదిగ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలపై తగిన చర్యలు తీసుకుని, మాదిగ జాతి ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
కడప జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గడ్డం నరసింహులు మాదిగ ఈ జిల్లాలో జరిగిన మారణకాండలను ప్రస్తావిస్తూ, మాదిగ జాతి బిడ్డల ప్రాణాలకు విలువ లేదా అన్న ప్రశ్నను లేవనెత్తారు. మాదిగలు చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క మంత్రి గాని రాకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్ కార్యాచరణను రూపొందించి, అవసరమైతే ఏ స్థాయిలోనైనా ఉద్యమాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు కొనసాగితే భవిష్యత్తులో విభిన్న రకాల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దాసరి మేరీ (జిల్లా మహిళా అధ్యక్షురాలు), జమ్మలమడుగు నియోజకవర్గ కన్వీనర్ కోటసుబ్బయ్య మాదిగ, దాసరి కుమార్ మాదిగ (ప్రొద్దుటూరు అధికార ప్రతినిధి), జిల్లా MEF ఇన్చార్జి మిద్దె పాములేటి మాదిగ, జిల్లా కో కన్వీనర్ సుబ్బ గాండ్ల ఓబులేష్ మాదిగ, ఎర్రగుంట్ల మండల అధ్యక్షులు అలవలపాడు గంగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.













