ప్రొద్దుటూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగి, అనంతరం సంబంధిత అధికారులకు తమ డిమాండ్లను తెలియజేశారు.

ఈ సందర్భంగా కార్మికులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆప్కాస్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, మున్సిపాలిటీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని, 60 సంవత్సరాలు పూర్తయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు పింఛన్ సౌకర్యం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికులకు ప్రస్తుత రేట్ల ప్రకారం కనీస వేతనం రూ.18,500 చెల్లించాలని, వారిని ఆప్కాస్‌లో చేర్చాలని కోరారు. 12వ పీఆర్సీని అమలు చేసి జీతాలు పెంచాలని, మృతి చెందిన కార్మికులకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందించాలని కూడా వారు డిమాండ్ చేశారు.

కార్మికులకు అవసరమైన పనిముట్లు సమకూర్చాలని, పనిలో ఉపయోగించే కొబ్బరి నూనె, చెప్పులు, యూనిఫాం అందించాలని కోరారు. అలాగే పుష్‌కార్టులు, వీల్‌బారోలు, చెత్త డబ్బాలు, చీపుర్లు తదితర పారిశుధ్య పరికరాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్, కమిటీ సభ్యులు గురమ్మ, రమాదేవి, నీతమ్మ, ప్రమీలమ్మ, రవి, కోవిడ్ యూనియన్ నాయకులు మేరీబాబు, దావీదు, కార్తీక్, చిన్న, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.