రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ నెం.7 విడుదల చేసిన నేపథ్యంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. ఉద్యోగ సంఘాలతో ఇటీవల జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు వెలువడటం ఉద్యోగుల్లో సంతృప్తిని కలిగించింది.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ జె.రామసుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు 100 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరై జీఓ విడుదలపై ఆనందం వ్యక్తం చేశారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగుల ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంశం పరిష్కారానికి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ తీసుకున్న చొరవ కీలక పాత్ర పోషించిందని రామసుబ్బయ్య యాదవ్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయడం, పదోన్నతులు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని రామసుబ్బయ్య యాదవ్ కోరారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం మరింత చురుకుగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జీఓ నెం.7 విడుదల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణతో పాటు జిల్లా నాయకత్వానికి రామసుబ్బయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం సచివాలయ ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచిందని ఆయన భావించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులతో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు ఇ.ప్రమీల, సదాశివయ్య, నాగర్జున, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉద్యోగులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ జీఓ అమలుపై ఆశాభావం వ్యక్తం చేశారు.













