ప్రొద్దుటూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక

జల జీవన్ మిషన్ పరిధిలో అమలు కానున్న అమరజీవి జలధార పథకం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

డిప్యూటీ సీఎం హెలికాప్టర్ ప్రొద్దుటూరు హెలిప్యాడ్‌కు చేరుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జనసేన ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, రమేశ్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్థానికంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుని నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

జల జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార పథకం ద్వారా ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి అమరజీవి జలధార పైలాను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారానికి దోహదం కలుగుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.