పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు, వ్యాపార వర్గాలు బాధ్యతతో వ్యవహరించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ వాణిజ్య కేంద్రాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

ప్రొద్దుటూరులోని Wines షాపులు, టీ దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తున్నదని కమిషనర్ తెలిపారు. ఈ వ్యర్థాల కారణంగా రహదారులు, డ్రైనేజీలు మూసుకుపోయి, వాటి శుభ్రత కోసం మున్సిపాలిటీ ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ స్పష్టం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, దానికి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించేలా ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గితే పట్టణంలో చెత్త సమస్య తగ్గి, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రజలు, వర్తకులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసికట్టుగా ముందుకు రావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగస్వాములై, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత కోసం మున్సిపాలిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని కమిషనర్ సూచించారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పునరుద్ఘాటించారు.