కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్‌లోని రాజరాజేశ్వరి గుడి సమీపంలో నివసిస్తున్న రమేష్ సుదీర్ఘకాలంగా తీవ్రమైన వైకల్యంతో మంచానికే పరిమితమై దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. నిస్సహాయ స్థితిలో, ఆశలు అడియాసలైన పరిస్థితిలో ఉన్న రమేష్ ఆవేదనను గమనించిన ప్రముఖ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అతనికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పింఛన్ హక్కు కోసం నేరుగా రంగంలోకి దిగారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ వికలాంగులకు నెలకు 6,000 రూపాయల పింఛన్ మంజూరు అవుతోంది. అయితే రమేష్ లాంటి సంపూర్ణ వైకల్యంతో మంచానికే పరిమితమైన బాధితులకు నెలకు 15,000 రూపాయల పూర్తి పింఛన్ అందించాల్సి ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రమేష్‌కు ఇప్పటివరకు కేవలం సాధారణ వికలాంగుల పింఛన్ అయిన 6,000 రూపాయలే మంజూరయ్యాయి.

ఔషధాలు, నిత్యావసరాలు, ఇతర వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న ఈ సమయంలో ఆ 6,000 రూపాయలతోనే రమేష్, ఆయన తండ్రి నెలంతా గడపడం కష్టసాధ్యమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ పడుతున్న యాతనను ప్రత్యక్షంగా చూసి, అతని తండ్రి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

రమేష్‌కు ధైర్యం చెబుతూ, అతని కోరిక మేరకు తనతో కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా రమేష్ ఆనందభాష్పాలు కార్చినట్లు అక్కడున్న వారు తెలిపారు.

రమేష్ కుటుంబం అత్యంత దయనీయ స్థితిలో ఉందని అర్థం చేసుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెంటనే తన చేతుల మీదుగా రెండు నెలలకు సంబంధించిన పూర్తి పింఛన్ మొత్తాన్ని తక్షణ సహాయంగా అందజేశారు. రమేష్‌కు భరోసా కల్పిస్తూ, పూర్తి పింఛన్ హక్కు సాధించే వరకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సహచరులు పేర్కొన్నారు.

తరువాత నేరుగా స్థానిక నాలుగవ సచివాలయానికి వెళ్లిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అకస్మాత్తుగా సచివాలయానికి చేరుకోవడంతో ఉద్యోగులు హుటాహుటిన లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

“సంపూర్ణ వైకల్యంతో మంచానికే పరిమితమైన రమేష్‌కు నెలకు రావాల్సిన పూర్తి పింఛన్ వెంటనే మంజూరు కావాలి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి అతనికి సక్రమంగా పింఛన్ వచ్చేలా చూడకపోతే, నేను ఆ పిల్లోడిని రమేష్‌ను ఎత్తుకొని నేరుగా ధర్నాకు దిగుతాను”

ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఈ ఘాటైన హెచ్చరికతో సచివాలయ సిబ్బంది స్పందించి, రమేష్‌కు తప్పకుండా పూర్తి పింఛన్ మంజూరయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అధికారుల నిర్లక్ష్యానికి గురైన పేదవారికి అండగా నిలవడం, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం అధికారులను నిలదీయడం ప్రవీణ్ కుమార్ రెడ్డి నైజమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మాటలకంటే చేతలకే ప్రాధాన్యం ఇస్తూ, చట్టం, ధర్మానికి కట్టుబడి పనిచేసే ఆయన నాయకత్వానికి ఈ సంఘటన మరో తార్కాణంగా నిలిచింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన భరోసాతో రమేష్ కుటుంబంలో మళ్లీ కొత్త ఆశలు చిగురించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.