రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ప్రొద్దుటూరులో అమరజీవి జలధార పథకం ప్రారంభం
కడప జిల్లా ప్రొద్దుటూరులో జల జీవన్ మిషన్ పరిధిలో అమలు కానున్న అమరజీవి జలధార పథకానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో ఉంచుకుని పట్టణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

జల జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార పథకం ద్వారా ప్రొద్దుటూరు పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీర్ఘకాలిక తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. వీరిద్దరి చేతుల మీదుగా శీలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి జలధార పైలాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం అమలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జనసేన ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, రమేశ్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.














