వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల ఆస్తులకు, బ్యాంకుల్లోని డిపాజిట్లకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన విద్యుత్ ఉద్యోగి సుబ్బరాయుడి కుటుంబానికి దక్కాల్సిన రూ.11 లక్షల ప్రమాద బీమా సొమ్మును టౌన్ బ్యాంకు నుంచి టీడీపీ నేత ఈవీ సుధాకర్ రెడ్డి అక్రమంగా కాజేశారని ఆయన విమర్శించారు. మృతుడి అసలు నామినీ అయిన కుమార్తె సుచరితకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆమె స్థానంలో ఉషారాణి అనే మరో మహిళను అక్రమంగా ప్రవేశపెట్టి ఈ మోసానికి పాల్పడ్డారని రాచమల్లు మండిపడ్డారు.

ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చేంతవరకు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నోరు మెదపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విషయం బయటకు పొక్కడంతోనే ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి రంగంలోకి దిగి ఆ సొమ్మును తిరిగి బ్యాంకులో జమ చేయించారని రాచమల్లు ఎండగట్టారు.

నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిరుద్యోగ యువతకు దక్కాల్సిన డీఎస్సీ పోస్టుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులు, అవకాశాలు సొంత ప్రయోజనాల కోసం కొందరి చేతుల్లో బందీగా మారుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బ్యాంక్ మోసం వెనుక ఉన్న సూత్రధారులపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, సమగ్ర న్యాయ విచారణ జరిపించే వరకు వదిలిపెట్టబోమని రాచమల్లు హెచ్చరించారు. బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిస్తామని తెలిపారు.