రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబానికి జీవితాంతం తీరని విషాదాన్ని మిగిలించగలదనే వాస్తవాన్ని ప్రొద్దుటూరు బస్టాండ్‌లో కనిపిస్తున్న దృశ్యాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. అక్కడ రోజూ కనిపిస్తున్న పరిస్థితులు ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రొద్దుటూరు బస్టాండ్ నుంచి వివిధ మార్గాల్లో నడిచే బస్సుల్లో సీట్లు లేక స్కూల్, కాలేజీ విద్యార్థులు ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బస్సు లోపల కిక్కిరిసిన జనంతో చోటు లేకపోవడంతో, తలుపు దగ్గర ఫుట్‌బోర్డులపై నిలబడి, ఒక్క చేతితో బస్సు పట్టుకుని, మరో చేతిలో పుస్తకాలు పట్టుకుని ప్రయాణం చేయడం సాధారణంగా మారింది.
చేతిలో పుస్తకాలు, కళ్లలో భవిష్యత్తు కలలు నిండిన ఈ విద్యార్థులకు ప్రయాణంలో మాత్రం భద్రత కరువైంది. బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేస్తే, మలుపు తిరిగితే లేదా రోడ్డుపై గుంతలు ఉంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలను చదువుకోడానికి పట్టణాలకు, సమీప గ్రామాలకు పంపుతున్న తల్లిదండ్రులు ఉదయం, సాయంత్రం బస్టాండ్ వద్ద కనిపించే ఈ దృశ్యాలు చూసి భయాందోళనలకు గురవుతున్నారు. బస్సుల్లో తగినన్ని సీట్లు లేకపోవడం, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ఇష్టంలేకపోయినా ఫుట్‌బోర్డులపై ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత ఎవరిది అనే ప్రశ్న స్థానికంగా చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీ టైమింగ్స్‌కి అనుగుణంగా అదనపు బస్సులు నడపడం, ఫుట్‌బోర్డు ప్రయాణాలను కట్టడి చేయడం, బస్టాండ్ పరిసరాల్లో పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి, అదనపు బస్సులు ఏర్పాటు చేసి, ఫుట్‌బోర్డు ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు చదువుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమో, వారి ప్రాణ భద్రత కూడా అంతే ముఖ్యమని వారు గుర్తుచేస్తున్నారు.













