ప్రొద్దుటూరు: కారుణ్య నియామకాల వ్యవహారంపై అధికార స్థాయిలో విచారణ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తూ సేవలోనే మరణించిన వర్కర్స్ లాజర్, నరసింహులు కుటుంబాలకు కారుణ్య నియామకాల విషయంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, అనంతపురం మున్సిపల్ ఆర్డీ ఈ అంశంపై విచారణ చేపట్టారు.

సేవలో ఉండగానే మృతి చెందిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కారుణ్య నియామకాల ప్రక్రియలో లోపాలు ఉన్నాయన్న ఆరోపణలతో సంబంధిత కుటుంబాలు, కార్మిక సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా అనంతపురం మున్సిపల్ ఆర్డీ కార్యాలయం నుంచి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

విచారణలో భాగంగా బుధవారం ప్రొద్దుటూరు మున్సిపల్ ఏసీ గౌడ్, కారుణ్య నియామకాలుకు సంబంధించిన పైళ్లను అనంతపురం మున్సిపల్ ఆర్డీ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు మున్సిపల్ వర్గాలు వెల్లడించాయి. లాజర్, నరసింహులు కుటుంబాల కారుణ్య నియామకాల ఫైళ్లతో పాటు సంబంధిత సేవా రికార్డులు, మున్సిపల్ కార్యాలయ అంతర్గత నోట్లు, సిఫార్సుల వివరాలు కూడా పరిశీలనకు వెళ్లినట్టు సమాచారం.

ఆర్డీ కార్యాలయంలో జరిగిన విచారణ సందర్భంగా ఏసీ గౌడ్‌ను వివరణ కోరినట్లు తెలుస్తోంది. కారుణ్య నియామకాల ఫైళ్లపై స్పష్టత ఇవ్వాలని ఆర్డీ అధికారులు అడిగినప్పుడు, ఏసీ గౌడ్ ఇతర సబ్జెక్ట్ ఫైళ్లను మాత్రమే తీసుకెళ్లానని తెలిపినట్టు సమాచారం. దీంతో కారుణ్య నియామకాల అసలు ఫైళ్ల స్థితిగతులపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆర్డీ కార్యాలయం అదనపు సమాచారం కోరే అవకాశం ఉన్నట్లు మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి.

లాజర్, నరసింహులు కుటుంబాల కారుణ్య నియామకాలపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న ఈ విచారణలో, నియామక ప్రక్రియలో ఏవైనా నిర్లక్ష్యాలు, ఆలస్యం లేదా విధి విరుద్ధ చర్యలు జరిగాయా అన్న అంశాలపై ఆర్డీ దృష్టి సారించినట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు, బాధ్యతల నిర్ధారణ, కారుణ్య నియామకాల అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ వర్గాలు భావిస్తున్నాయి.