ప్రొద్దుటూరు సహకార టౌన్ బ్యాంకుకు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘన చరిత్ర ఉంది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక సహకార బ్యాంకులు మూతపడిన సమయంలో కూడా ఈ బ్యాంకు ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది. కాలక్రమేణా బ్యాంకు శాఖలను ఎర్రగుంట్ల, కడప, బద్వేల్ ప్రాంతాలకు విస్తరించింది. అప్పటి పాలకవర్గాలు, అధికారులు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ బ్యాంకును అభివృద్ధి దిశగా నడిపించారు.

అయితే ఇటీవల బ్యాంకు అంతర్గత వ్యవహారాలు, ఆర్థిక వివరాలు బయటకు లీకవుతున్నాయనే సమాచారం వెలుగులోకి వచ్చింది. పాలకవర్గంలోని, ఉద్యోగుల్లోని కొందరు బ్యాంకులో జరిగే ప్రతి విషయాన్ని బయటకు చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిపాజిట్ దారులు, రుణగ్రహీతల వివరాలు కూడా బయటకు వెళ్తున్నాయన్న ఆందోళన బ్యాంకు వర్గాల్లో వ్యక్తమవుతోంది.

పాలకవర్గంలోని ఒక ముఖ్య సభ్యుడు SS మాల్ బ్యాంకు రుణాల రికార్డులను TDP నేత ప్రవీణ్ కు అందజేసినట్లు, దీంతో బ్యాంక్ విశ్వసనీయతను బజారులో పెట్టినట్లైందని బ్యాంకు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లీకుల కారణంగా TDPలోని రెండు వర్గాలు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాదం పార్టీ అధిష్ఠానం వరకు వెళ్లినట్లు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల స్థానిక TDP ముఖ్య నేతలు బ్యాంకు పాలకవర్గం, అధికారులను పిలిపించి లీకుల అంశంపై విచారణ జరిపినట్లు తెలుస్తోంది. బ్యాంకు వ్యవహారాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు కలగజేసుకోవడం, అంతర్గత సమాచారం బయటకు చేరవేయడం పై వారు వివరణ కోరినట్లు, బ్యాంకు పెద్దను తీవ్రంగా మందలించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకుముందు జరిగిన ఈ సంఘటనల తర్వాత కూడా తాజాగా RBI అధికారులు బ్యాంకు తనిఖీకి రానున్నారన్న సమాచారాన్ని మళ్లీ లీక్ చేయడం బ్యాంకు వర్గాలను మరింత ఆందోళనకు గురి చేసింది. బ్యాంకు అంతర్గత సమాచారం, తనిఖీల వివరాలు ముందుగానే బయటకు వెళ్లడం పై బ్యాంకు పాలకవర్గం, అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నట్లు, ఈ లీకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.