రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపల్ అనిబిసెంట్ హైస్కూలు గ్రౌండ్‌లో ప్రతి ఏడాది నిర్వహించే దసరా ఎగ్జిబిషన్ ఈసారి జరగడం అనుమానాస్పదంగా మారింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో పట్టణ ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా నెలరోజుల ముందే పూర్తి చేయాల్సిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లీజు టెండర్లను మున్సిపల్ అధికారులు ఈసారి ఆలస్యంగా నిర్వహించారు. దసరా ప్రారంభానికి కేవలం పది రోజుల ముందు సెప్టెంబరు 28న టెండర్లు చేపట్టడం వల్ల ఏర్పాట్లు మందకొడిగా సాగుతున్నాయి. మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్‌లో ఇప్పటి వరకు షెడ్లు నిర్మించడం, వినోద పరికరాలు అమర్చడం వంటి పనులు ప్రారంభం కాకపోవడం పరిస్థితిని మరింత అనుమానాస్పదంగా మార్చింది.
ఈ ఏడాది కొత్తపల్లె పంచాయతీలోని Dmart వద్ద కొందరు మరో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం కూడా ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూలు ఎగ్జిబిషన్‌పై ప్రభావం చూపనుంది. మున్సిపాలిటీ గ్రౌండ్‌లో 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు సుమారు రూ. 2.30 కోట్లకు పైగా లీజు చెల్లించాల్సి ఉండగా, కొత్తపల్లె పంచాయతీలోని ప్రైవేటు స్థలాన్ని అదే 45 రోజులకు కేవలం రూ. 60 వేలకే లీజుకు తీసుకున్నట్లు సమాచారం.
అదే సమయంలో కొత్తపల్లెలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఎంట్రీ టికెట్లు, వినోద పరికరాలపై వసూలు చేసే చార్జీలు మున్సిపాలిటీ ఎగ్జిబిషన్‌తో పోలిస్తే దాదాపు సగం వరకు తక్కువగా ఉండేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు టెండర్ పొందిన కాంట్రాక్టర్‌కు పోటీ ఎగ్జిబిషన్ వల్ల నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మున్సిపాలిటీకి ఇప్పటి వరకు చెల్లించాల్సిన రూ. 1.65 కోట్లను కాంట్రాక్టర్ చెల్లించలేదు. టెండర్ సమయంలో డిపాజిట్‌గా చెల్లించిన రూ. 25 లక్షలు మాత్రమే మున్సిపాలిటీ ఖాతాలో జమయ్యాయి. మిగతా మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఎగ్జిబిషన్ నిర్వహణపై మరింత అనిశ్చితి నెలకొంది.
దసరా నవరాత్రులు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది నవరాత్రుల తొలి రోజునే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. అయితే ఈసారి మున్సిపల్ హైస్కూలు గ్రౌండ్‌లో దసరా ఎగ్జిబిషన్ జరగకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మున్సిపాలిటీ ఆదాయానికి రూ. 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దసరా ఎగ్జిబిషన్ నిర్వహణపై వివరణ కోరగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌ఛార్జ్ ఆర్వో ముంజాహాద్‌గౌడ్ స్పందించారు. శనివారం నాటికి కాంట్రాక్టర్ శివు Kకుమార్ బకాయి మొత్తాన్ని చెల్లిస్తానని మున్సిపాలిటీకి తెలిపినట్లు ఆయన చెప్పారు.
ముంజాహాద్‌గౌడ్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోతే ముందుకు వచ్చే ఇతర కాంట్రాక్టర్లకు ఎగ్జిబిషన్ నిర్వహణ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని, మున్సిపాలిటీ ఆదాయం నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.













