కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి కొత్త ఊపు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సందడి మధ్యలోనే కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అధికారికంగా ప్రారంభం లభించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.12 కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ పర్యవేక్షించారు.

కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణ రూపురేఖలు గణనీయంగా మారుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పట్టణానికి మంచి రోజులు మొదలయ్యాయని, మున్సిపాలిటీ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిధులతో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి పనుల్లో వివిధ వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల ఆధునీకరణ, తాగునీటి సరఫరా మెరుగుదల, పైప్‌లైన్ల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, పట్టణ పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఉన్నాయి. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే కొన్ని కాలంగా సాగుతున్న అభివృద్ధి చర్యలకు ఈ కొత్త పథకాలు తోడై పట్టణం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తగ్గే అవకాశముందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో పాటు ఆయన సోదరుడు రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ నల్లపోతుల నాగరాజు, మాజీ సర్పంచ్ అభ్యర్థి బచ్చల ప్రతాప్, రాష్ట్ర మైనార్టీ చైర్మన్ ముక్తియార్, పలువురు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.