ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ గురువారం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల అమలు స్థితిని ఈ సమావేశంలో విపులంగా పరిశీలించారు.

మొత్తం 49 పనులకు ఆమోదం లభించినప్పటికీ, వాటిలో 14 పనులు మాత్రమే ప్రారంభమైనట్లు కమిషనర్ దృష్టికి రావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా అభివృద్ధి పనుల అమలులో జాప్యం చోటుచేసుకోవడం పట్ల కమిషనర్ ఆక్షేపించారు.

మిగిలిన పనులను ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ప్రారంభించాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అగ్రిమెంట్ పూర్తయిన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని స్పష్టంగా సూచించారు. పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించే గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇకనుంచి పనుల పురోగతిని స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తానని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేలా ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి అభివృద్ధి పనులను ఆలస్యం చేయకుండా కాంట్రాక్టర్లతో వెంటనే పనులు ప్రారంభించాలనే సూచనలు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు ఇవ్వడంతో, ఈ సమీక్షా సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.

విధుల నిర్వహణలో అలసత్వం వహించిన ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీర్ పీ. ఉదయ్ కుమార్ రెడ్డిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను విధుల నుండి తప్పించి సొంత శాఖకు పంపించినట్లు కమిషనర్ సమావేశంలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, పనుల అమలులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

ప్రారంభించిన ప్రతి పనికి సంబంధించిన వివరాలను సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో ప్రగతి పరిశీలన కోసం పంపించాలని, పనుల పురోగతిని నిరంతరం అప్‌డేట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజాప్రయోజనార్థం సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనుల లక్ష్యాలను సాధించేవరకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసులకు సూచించారు.

ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు ఆలస్యం కాకుండా ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్స్ రాజేష్, ఏశోద, అసిస్టెంట్ ఇంజనీర్స్ సురేంద్ర, దస్తగిరి, వినోద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.