రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలో కురిసిన వర్షాలతో నగరం నీటిమయమైంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, వ్యాపార కేంద్రాలు వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం నీరు సజావుగా పారాల్సిన డ్రైన్స్‌పై అక్రమ కట్టడాలు, బంకులు పెరగడంతో నీటి పారుదల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది.
పట్టణంలో ఉన్న డ్రైన్స్‌లో చాలా వరకు అక్రమణకు గురికావడంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైన్స్‌లో ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల మురుగు కాలవలు వర్షపు నీటితో పోర్లుతున్నాయి. దీంతో వర్షం పడిన ప్రతిసారి కాలనీల్లో, వీధుల్లో నీరు నిలిచి మురుగు నీటితో కలిసిపోతూ దుర్వాసన వ్యాపిస్తోంది.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్స్‌లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించే పనిలో పారిశుధ్య కార్మికులు నిమగ్నమయ్యారు. ఉదయం 4 గంటల నుంచే మున్సిపల్ సిబ్బంది కమీషనర్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. డ్రైన్స్‌పై అక్రమంగా కట్టడాలు నిర్మించి, వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులకు అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
డ్రైన్స్‌పై నిర్మించిన అక్రమ కట్టడాలు, బంకులు వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ప్రతి వర్షంలోనూ పట్టణం నీటిమయమవుతున్నదని మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని నివారించేందుకు దశలవారీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు.
ప్రొద్దుటూరులో డ్రైన్స్‌పై ఉన్న అక్రమ కట్టడాలు, బంకులను తొలగించేందుకు దశలవారీ ప్రణాళిక సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించే పనులను ప్రారంభించేందుకు మున్సిపల్ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
పట్టణంలో వర్షాల సమయంలో నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే డ్రైన్స్‌పై ఉన్న అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించడంతో పాటు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మున్సిపల్ వర్గాలు సూచిస్తున్నాయి. డ్రైన్స్‌లో చెత్త వేయకుండా ప్రజలు సహకరిస్తేనే పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.













