కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలుగుచూసిన గ్యాస్ మోసం కేసు స్థానికులను, అధికారులను ఉలిక్కిపడేలా చేస్తోంది. నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్లను ఆయుధంగా చేసుకుని, ఒక మహిళ ఏళ్ల తరబడి సాగించిన అక్రమ దందా ఇప్పుడు బయటపడుతోంది. ప్రసిద్ధి చెందిన ఒక కుటుంబం పేరును అడ్డుపెట్టుకుని, గ్యాస్ సరఫరా వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఈమె చేసిన నిలువుదోపిడీపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

కంపెనీ నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్లపై ఉండే ప్లాస్టిక్ సీల్‌ను చిన్న గుండుసూదితో చెక్కుచెదరకుండా తొలగించడం ఈ మహిళ ప్రధాన నైపుణ్యంగా మారింది. ప్రతి సిలిండర్ నుంచి కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు గ్యాస్‌ను వేరే ఖాళీ సిలిండర్లలోకి రీఫిల్ చేసి, ఆ గ్యాస్‌తో పూర్తి చేసిన సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ లక్షల్లో అక్రమార్జన చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉందని ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే, “మీ సిలిండర్ ఏదో మీరే తీసుకోండి” అంటూ ఏమాత్రం భయపడకుండా ఎదురు మాటలు చెప్పడం ఈమె శైలిగా స్థానికులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల వల్ల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితులు కొనసాగితే తన దందాకు మరింత లాభమని పక్కవారితో నవ్వుతూ మాట్లాడేదని శాల ఏరియా వాసులు పేర్కొంటున్నారు.

గ్యాస్ దొంగతనంతో పాటు ఆధార్ డేటా దుర్వినియోగం కూడా ఈ వ్యవహారంలో బయటపడింది. సహాయం చేస్తానని, రకరకాల మాటలతో పేద ప్రజల నుంచి ఆధార్ కార్డులను సేకరించి, వారి పేర్లపై వారికి తెలియకుండా వందలాది గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించుకున్నట్లు సమాచారం. కాగితాల్లో కస్టమర్లు వేరైనా, ఆ సిలిండర్లన్నీ దిగేది మాత్రం ఆమె ఇంటికే. ఆటో, స్కూటీ సహాయంతో ప్రతి ఇంటికి వెళ్లి ఈ సిలిండర్లను విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జించినట్లు స్థానిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇంత పెద్ద ఎత్తున పగటిపూటే దోపిడీ జరుగుతుంటే సంబంధిత రెవెన్యూ, విజిలెన్స్ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయనే ప్రశ్న స్థానికుల మధ్య చర్చనీయాంశమైంది. తమ పరిధిలో అక్రమ గ్యాస్ రీఫిలింగ్, నకిలీ కనెక్షన్ల దందా జరుగుతున్నా తహసీల్దార్, రెవెన్యూ అధికారులు కనీసం స్పందించకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించాల్సిన విజిలెన్స్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పేదల పొట్ట కోసే ఈ అక్రమ గ్యాస్ దందా, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే రీఫిలింగ్ కార్యకలాపాలపై అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం వ్యవస్థ పతనానికి నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రొద్దుటూరులో వెలుగుచూసిన ఈ నకిలీ గ్యాస్ దందా కేవలం ఒక మహిళ మోసం మాత్రమే కాకుండా, అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి నిలువెత్తు ఉదాహరణగా స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

బాధితులైన అమాయక ప్రజల ఆధార్ కార్డులపై తక్షణ విచారణ జరిపి, ఈ అక్రమ కనెక్షన్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి, గ్యాస్ కంపెనీలు, రెవెన్యూ, విజిలెన్స్ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో, నిత్య జీవితంతో ఆడుకుంటున్న ఈ ఘరానా లేడీపై, ఆమెకు సహకరిస్తున్న అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ కిలాడీ లేడీ మోసాలకు సంబంధించిన సంచలనాత్మక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె వలలో చిక్కుకున్న బాధితుల సంఖ్య, అధికారుల కళ్లు గప్పి జరిగిన కోట్ల రూపాయల మోసాల వివరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ అక్రమ సామ్రాజ్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.