ప్రొద్దుటూరు మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. పట్టణ పరిధిలో నిర్లక్ష్యం, పని దొంగ అనే మాటలు వినిపిస్తున్నా, అసలు బాధ్యతలు మోయాల్సిన స్థాయిలో ఉన్న హెల్త్ అధికారి వ్యవహార శైలి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వీధులు ఒక్కరోజు సరిగా ఊడకపోయినా, కాలువ పూడికలు తొలగించడంలో ఆలస్యం జరిగినా పారిశుద్ధ్య కార్మికులపై ప్రజలు, ఉన్నతాధికారులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారని కార్మిక వర్గం వాపోతుంది. పని చేయకపోతే బదిలీలు పెట్టించుకుని వెళ్లిపోవాలని హెచ్చరికలు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు. అయితే అదే విభాగంలో లక్షల రూపాయల వార్షిక వేతనం పొందుతున్న హెల్త్ అధికారి విషయంలో మాత్రం ఈ కఠిన ధోరణి కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ముప్పై ఏళ్లుగా పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేసి, ప్రమోషన్ ద్వారా హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారి స్థాయికి చేరుకున్న సదరు అధికారి పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు సుమారు నాలుగు వేల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్న ఈ అధికారి, పని విషయానికి వస్తే వివిధ సాకులు చెబుతూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శారీరక ఇబ్బందుల వల్ల పనిభారం మోయలేకపోతే బదిలీ కోరుకోవచ్చు, లేకపోతే నిరుద్యోగ యువకులు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఒక అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసుకుని విధులు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, అవేమీ చేయకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కార్మికుల్లో వినిపిస్తోంది. బాధ్యతగల పదవిలో ఉండి ఈ విధంగా వ్యవహరించడం పారిశుద్ధ్య రంగానికే కాకుండా ఆ శాఖ ప్రతిష్ఠకూ భంగం కలిగిస్తోందని వారు అంటున్నారు.

ఇప్పటివరకు ప్రొద్దుటూరులో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు ఎవరూ ఈ అధికారిపై గణనీయమైన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం కార్మికుల్లో నెలకొంది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ ఈ హెల్త్ అధికారి అలసత్వంపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక ఇప్పటివరకు ఉన్న పరిస్థితులే కొనసాగుతాయా అన్నది పట్టణంలో ప్రధాన చర్చగా మారింది. గత అనుభవాలను చూపిస్తూ ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన సదరు అధికారి, ఇప్పటికైనా సాకులు మానుకుని నిజాయితీతో విధులు నిర్వర్తిస్తారా, లేక పాత పద్ధతినే కొనసాగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.