రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పట్టణంలో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక వృత్తిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 10 వేల కుటుంబాలు ఈ వృత్తిని ఆశ్రయించి జీవనోపాధి కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, పెద్ద కాంట్రాక్టర్లు తక్కువ రేట్లకు పనులు చేపట్టి స్థానిక వృత్తిదారుల అవకాశాలను హరించేస్తున్నారని వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలను వివరించే వినతిపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులన్నీ ఇతర రాష్ట్రాల కార్మికులకే కేటాయిస్తున్నారని, దీంతో స్థానిక వృత్తిదారులకు పనులు దొరకడం లేదని వారు పేర్కొన్నారు. సరిపడా పనులు లేకపోవడంతో షాపుల అద్దెలు, రూముల అద్దెలు, కరెంట్ బిల్లులు, పనివారి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
వేరే రంగాల్లో పనిచేసే నైపుణ్యం లేకపోవడంతో అప్పులు తీర్చలేక తీవ్ర సంక్షోభంలో ఉన్నామని, ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వృత్తిదారుల జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ నిర్మాణ పనుల్లో స్థానిక వృత్తిదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల నుండి లైసెన్స్ లేకుండా వచ్చి పనిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న కార్మికుల వల్ల స్థానికులకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, దీనిపై అధికారుల దృష్టి సారించాలని వారు అభ్యర్థించారు.
చిన్న వృత్తిదారులకు తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు అందించాలని, తద్వారా వారు తమ వ్యాపారాలను కొనసాగించుకునేలా సౌకర్యాలు కల్పించాలని యూనియన్ ప్రతినిధులు సూచించారు. అదేవిధంగా వర్కర్ల కోసం తక్కువ అద్దెతో ప్రత్యేక ‘ట్రేడ్ కాంప్లెక్స్’ లేదా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సౌకర్యాలు ఉంటే వృత్తిదారులు ఒకేచోట చేరి పనులు సులభంగా పొందగలరని, ఖర్చులు కూడా తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో దస్తగిరి, వల్లి, మొహమ్మద్ రఫీతో పాటు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యేకు సమస్యల తీవ్రతను వివరించి, త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని వృత్తిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.













