రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్‌లోని మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాలు దెబ్బతింటున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పరిశీలించారు. మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎమ్మెల్యే శనివారం మార్కెట్ యార్డ్‌ను సందర్శించి భవనాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాలు, పరిసర నిర్మాణాలు కొన్ని చోట్ల పాడైపోయినట్లు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రైతులు, వ్యాపారులు తరచూ ఉపయోగించే ఈ భవనాలు మరమ్మతులు అవసరమై ఉన్నాయని ఇంచార్జ్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దెబ్బతిన్న భాగాలను గుర్తించి, అవసరమైన పునరుద్ధరణ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవనాల బలపరచడం, మరమ్మతులు, అవసరమైన సదుపాయాల మెరుగుదలపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.
మార్కెట్ యార్డ్‌లో పర్యటించిన సందర్భంగా అక్కడి ప్రస్తుత పరిస్థితులు, సౌకర్యాలపై కూడా ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీ భవనాల పునరుద్ధరణ పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు మార్కెట్ కమిటీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, కార్యదర్శి రత్నంరాజు, డైరెక్టర్ షరీఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, భవనాల పునరుద్ధరణపై త్వరలోనే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.













