రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ ఆస్తులను రక్షించడంతో పాటు పట్టణ సుందరీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ & మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీమతి నిధి మీనా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఆస్తుల పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆమె సూచించారు.
బుధవారం ప్రొద్దుటూరులోని స్థానిక శివాలయం సర్కిల్ వద్ద ఉన్న మున్సిపల్ స్థలాన్ని జాయింట్ కలెక్టర్ నిధి మీనా, మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌తో కలిసి పరిశీలించారు. స్థల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం అక్కడి శుభ్రత, వినియోగంపై అధికారులతో చర్చించారు.

సంబంధిత అధికారులకు సూచనలు చేస్తూ, ఆ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనంతో సుందరీకరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ఉన్న మున్సిపల్ స్థలాలన్నింటినీ ఈ విధంగానే అభివృద్ధి చేసి ప్రజలకు విశ్రాంతి, వినోదానికి అనువైన వాతావరణం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
మున్సిపల్ స్థలాలకు స్పష్టమైన హద్దులు గుర్తించి, ఆక్రమణలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. మున్సిపల్ ఆస్తులపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన రికార్డులు, మ్యాపులు, బౌండరీ మార్కులు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు.

మున్సిపల్ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని జాయింట్ కలెక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్‌ను ఆమె ఆదేశించారు. పట్టణ సుందరీకరణ, పచ్చదనం పెంపు, ప్రజా సౌకర్యాల అభివృద్ధి, మున్సిపల్ ఆస్తుల వినియోగం వంటి అంశాలన్నీ ఆ నివేదికలో ప్రతిబింబించేలా తయారు చేయాలని సూచించారు.
ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి, మున్సిపల్ ఆస్తుల పరిరక్షణపై అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఈ సందర్శన సందర్భంగా స్పష్టం చేసినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి.













