రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు టౌన్‌లో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని మురికి కాలువల ద్వారా తరలించే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. గురువారం ఉదయం పట్టణంలోని పలు సులభ్ కాంప్లెక్స్‌లను ఆయన స్వయంగా పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో పారిశుధ్య పరిస్థితులు, దోమల వ్యాప్తి, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
సులభ్ కాంప్లెక్స్‌ల తనిఖీ సందర్భంగా కమిషనర్ పట్టణంలోని పలు దుకాణాలను కూడా పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగం, పారిశుధ్య నిర్వహణపై దుకాణ యజమానులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా మురికి, చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా పారవేయాలని యజమానులకు సూచించినట్లు కమిషనర్ వివరించారు.
బస్సు స్టాండ్ పరిసరాల్లో దోమల పెరుగుదలకు ఆస్కారం ఉన్న పరిస్థితులు గుర్తించిన కమిషనర్, అక్కడ వేలాది టైర్లలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పరిశీలించారు. వెంటనే ఆ నీటిని తొలగించి, దోమల నివారణకు మాలతీ యాన్ స్ప్రేయింగ్ చేయాలని శానిటేషన్ సూపర్ వైజర్ నూర్ బాషకు ఆదేశాలు జారీ చేశారు. నిల్వ నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని శానిటేషన్ విభాగానికి సూచించారు.
దోమల నివారణ చర్యల్లో భాగంగా రానున్న రెండు రోజులు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిల్వ ఉన్న మాంసం, చేపలు, తిండి పదార్థాల విక్రయాలపై నిఘా ఉంచాలని పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా కోసం మున్సిపాలిటీ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. వర్షాల కారణంగా నీటి కాలుష్యం, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఏవైనా సమస్యలు, సమాచారం కోసం మున్సిపాలిటీని సంప్రదించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వివరించారు.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సహాయం, సమాచారం కోసం మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. ప్రజలు అవసరమైతే మమ్మల్ని సంప్రదించాలి.













