ప్రొద్దుటూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. తొలి రోజు కౌన్సిలర్‌ పదవులకు మొత్తం 13 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ తెలిపారు. చైర్మన్‌ పదవికి మాత్రం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని ఆయన వెల్లడించారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్ల కోసం సింగిల్‌ విండో విధానంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. దాఖలైన నామినేషన్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత పత్రాలను నిబంధనల ప్రకారం భద్రపరిచినట్లు తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లను స్పెషల్‌ నోడల్‌ ఆఫీసర్‌ వెంకటపతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నెల 17, 18 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుందని అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం.

ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిబంధనలకు అనుగుణంగా సాగేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.