ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా పాటించాల్సిన చేయవలసినవి, చేయకూడనివి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా సాగేందుకు ఈ సూచనలు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.

అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు ఎన్నికల చట్టాలు, నిబంధనలు పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఓటరు జాబితాలను సమయానికి పొందడం, పోటీ చేయాలనుకునే వార్డు ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలు సరిచూసుకోవడం, అర్హత–అనర్హతలపై స్పష్టత కలిగి ఉండడం అవసరమని తెలిపారు. నామినేషన్ ఫారం నిర్ణీత నమూనాలో ఉందో లేదో పరిశీలించి, అభ్యర్థి స్వయంగా లేదా అతని ప్రతిపాదకుడు మాత్రమే ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు.

ఒక అభ్యర్థి తరఫున గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలు మాత్రమే దాఖలు చేయవచ్చని, ప్రతి నామినేషన్‌కు రసీదు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థి తప్పనిసరిగా హాజరై, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితాలో తన పేరు, వివరాలు సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలని చెప్పారు. పోలింగ్ గంటలు, పోలింగ్ కేంద్రాల జాబితా, ఎన్నికల ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లు, రిలీఫ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల నియామకంపై నిర్ణీత ఫారాలు, గడువులు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

నామినేషన్ దాఖలు సమయానికి ముందు లేదా తర్వాత పత్రాలు ఇవ్వకూడదని, ఎన్నికల అధికారి లేదా ఆయన అధికారం ఇచ్చిన అధికారి తప్ప మరెవరికీ నామినేషన్ ఇవ్వరాదని స్పష్టం చేశారు. అవసరమైన డిపాజిట్ చెల్లించడం తప్పనిసరి అని గుర్తుచేశారు. అభ్యర్థి పేరు, పార్టీ, గుర్తు ఉన్న ఐడెంటిటీ స్లిప్పులు జారీ చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, మతం, జాతి, కులం, వర్గం, భాష ఆధారంగా ఓటు వేయమని కోరడం, మతపరమైన లేదా జాతీయ చిహ్నాలను ప్రచారంలో ఉపయోగించడం నిషేధమని తెలిపారు.

ఎవరైనా అభ్యర్థి వ్యక్తిగత స్వభావంపై తప్పుడు ప్రకటనలు ప్రచురించడం, ఓటర్ల రవాణా కోసం వాహనాలను అద్దెకు తీసుకోవడం, నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి ఖర్చు చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోరడం, పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, దుష్ప్రవర్తన, బహిరంగ సభల నిర్వహణపై నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల పత్రాలు, నామినేషన్ పత్రాలు, అధికారిక జాబితాలు, నోటీసులపై ఎలాంటి మోసపూరిత చర్యలు, నాశనం, జోక్యం కఠినంగా నిషేధించబడ్డాయి.

పోలింగ్ ఏజెంట్ల ప్రధాన బాధ్యత తమ అభ్యర్థి ప్రయోజనాలను పోలింగ్ కేంద్రంలో కాపాడడమేనని స్పష్టం చేశారు. ఇందుకోసం అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ సంతకం చేసిన నియామక లేఖను ప్రిసైడింగ్ అధికారికి చూపించి, పోలింగ్ ప్రారంభం ముందు, సమయంలో, తర్వాత బ్యాలెట్ బాక్సుల భద్రత, సీళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు అనుమానాస్పద ఓటర్లను సవాలు చేయడం, చనిపోయిన లేదా హాజరు కాని ఓటర్ల జాబితాను వెంట తీసుకెళ్లడం, ఎన్నికల పత్రాల కవర్లపై సీళ్లు వేయడానికి చిన్న ముద్రను ఉపయోగించడం వంటి చర్యలు చేపట్టాలని చెప్పారు.

పోలింగ్ ఏజెంట్లు ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించే సమాచారాన్ని బయటపెట్టరాదని, ఏ ఓటరు హక్కు వినియోగంలో జోక్యం చేసుకోరాదని, పోలింగ్ కేంద్రం 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదని, సెల్ ఫోన్లు లోపలికి తీసుకురావరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

కౌంటింగ్ ఏజెంట్లు కూడా నిర్ణీత ఫారంలో నియామక లేఖను రిటర్నింగ్ అధికారికి సమర్పించి, కౌంటింగ్ హాల్‌లో క్రమశిక్షణ పాటించేందుకు సహకరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు నియమాలు తెలుసుకుని, బ్యాలెట్ బాక్సులు, EVM లపై సీళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయో లేదో పరిశీలించాలని చెప్పారు. కౌంటింగ్ హాల్‌లో దుష్ప్రవర్తన, ధూమపానం, సెల్ ఫోన్ వినియోగం పూర్తిగా నిషేధించబడింది.

అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల ఖర్చుల లెక్కలను నిర్ణీత ఫారాలలో నిర్వహించి, ఫలితాల ప్రకటన తర్వాత 45 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సిన బాధ్యత ఉందని అధికారులు గుర్తుచేశారు.