ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి, కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, IAS అధికారులతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.

సెప్టెంబర్ 25వ తేదీ గురువారం పురపాలక సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమీక్షా సమావేశంలో మున్సిపాలిటీకి మంజూరైన నిధుల వినియోగం, రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు తదితర అభివృద్ధి పనుల పురోగతి ఏ దశలో ఉందన్న అంశాలను విపులంగా పరిశీలించనున్నారని కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ పేర్కొన్నారు.

పురపాలక పరిధిలో జరుగుతున్న ప్రతి పనిపై స్పష్టమైన నివేదికలు సిద్ధం చేసి సమీక్షా సమావేశానికి సమర్పించాలనే దిశగా సంబంధిత శాఖల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా, పనుల నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సూచించినట్లు సమాచారం.

అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ శాఖలకు సంబంధించిన పబ్లిక్ పాజిటివ్ Perception ప్రగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు కమిషనర్ వివరించారు. ప్రజలలో ప్రభుత్వ పథకాలపై ఏర్పడుతున్న అభిప్రాయాలు, స్పందన, వాటి అమలు స్థితిగతులపై సమగ్రంగా చర్చించేందుకు ఈ సమీక్షా వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

సమావేశానికి ముందుగా సంబంధిత శాఖల ఇంజనీర్లు, సిబ్బంది ప్రస్తుత పనుల స్థితిగతులను, ఎదురవుతున్న సమస్యలను, అవసరమైన అదనపు నిధుల వివరాలను సమగ్రంగా నివేదికల రూపంలో సిద్ధం చేయాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష అనంతరం అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వబడతాయని పురపాలక వర్గాలు తెలిపాయి.