రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు స్థానికంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి కేంద్రంగా నిలిచిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ కమిషనర్ రవిచంద్రారెడ్డి హయాంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం, అధికారుల కనుసన్నల్లో సాగిన అరాచకాలు, కుంభకోణాలు మున్సిపాలిటీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని నగరంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంతో కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టడం స్థానిక ప్రజల్లో ఆశలను రేకెత్తించింది.

తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి, అక్రమాలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారని మున్సిపాలిటీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తన పనితీరును స్పష్టంగా చూపిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
ఇటీవల వైసీపీ నాయకులు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సాక్ష్యాలతో కూడిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమావేశంలో కొన్ని అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ప్రెస్ మీట్ అనంతరం కమిషనర్ విశ్వనాథ్ వెంటనే స్పందించి సంబంధిత అంశాలపై చర్యలు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ వర్గాలు తెలియజేశాయి.
ఆ ఆరోపణల నేపథ్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆర్ఐ రమేష్‌పై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఆయనను దిగువ స్థాయి ఉద్యోగానికి సిఫారసు చేస్తూ డిప్రమోట్ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇతర అధికారుల్లో కూడా చర్చకు కారణమైంది. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతం ఇచ్చిన నిర్ణయంగా దీనిని స్థానికులు భావిస్తున్నారు.
కమిషనర్ విశ్వనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మున్సిపల్ కార్యాలయంలో పని తీరు మారుతోందని కొంతమంది ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యంగా తీసుకుని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
గత పాలనలో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో, కొత్త కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలు నగర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడతాయన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడినవారిపై కఠిన వైఖరి, వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రొద్దుటూరు రూపురేఖలు మారుతాయా అన్న ఆసక్తి స్థానికుల్లో వ్యక్తమవుతోంది.













