రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.40 కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రొద్దుటూరు అభివృద్ధికి ఇప్పటికే రూ.316 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. తాజాగా మంజూరైన రూ.40 కోట్లతో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం కానుందని పేర్కొన్నారు.
మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులకు త్వరలో అంచనాలు రూపొందించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.
గత 25 ఏళ్లలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం ఇదే తొలిసారని వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని, సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.ఎస్. ముక్తియార్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి, కార్పొరేషన్ల డైరెక్టర్లు బేపారి జాకీర్ అహ్మద్, శ్రీనివాసాచారి, నాగరాజు, మార్కెట్ యార్డ్ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, ప్రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి, అగస్త్యేశ్వరాలయ పాలకమండలి చైర్మన్ వంగల నారాయణరెడ్డి, బొల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకమండలి చైర్మన్ దాదిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జనసేన నాయకులు రామారావు, జిలానీ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు నరేంద్రరావు, మాజీ జడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













