రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్ స్టేషన్ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ప్రజా రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఆర్టీసీలో అన్ని ఏసీ బస్సులనే ప్రవేశపెట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 100 కోట్ల ఉచిత ప్రయాణాలు విజయవంతంగా పూర్తి కావడంలో ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషించారని, వారి సేవలను ప్రభుత్వం అభినందిస్తున్నదని ఆయన అన్నారు.

సుమారు రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన బస్ స్టేషన్లో 12 ప్లాట్ఫారాలు ఏర్పాటు చేశారు. టికెట్ రిజర్వేషన్ కౌంటర్, త్రాగునీరు, మరుగుదొడ్లు, ప్రయాణికుల నిరీక్షణ గదులు వంటి సదుపాయాలు కల్పించారు. కొత్త బస్ స్టేషన్ ప్రారంభంతో ప్రొద్దుటూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రొద్దుటూరు బస్ స్టేషన్ అభివృద్ధి ద్వారా జిల్లాలో ప్రజా రవాణా సేవల ప్రమాణం మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసిన ఈ బస్ స్టేషన్లో శుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలియజేశాయి.

ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు, JMD శివ ప్రసాద్, జోన్-IV ED కిషోర్ ఆర్ ఆర్ కె కిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోన్-4 ఆర్టీసీ అధికారి ఆర్.ఎల్.వి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.














