రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీ 3వ సమావేశం గౌరవ ప్యానల్ చైర్మన్ డా. వరుణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వ్యాపారులు, ప్రజలు, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ నివారణ చర్యలను విస్తృతం చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
ప్లాస్టిక్ నిషేధం అమలును మరింత ప్రభావవంతంగా చేయడానికి అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి శనివారం కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతున్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడం ప్రభుత్వ, మున్సిపల్ యంత్రాంగం ఒంటరిగా సాధ్యమయ్యే పని కాదని, ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో సూచనలు వెలువడ్డాయి.
ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ చర్యలతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై సభ్యులు సలహాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, శ్రీ బి. మారుతీ ప్రసాద్, శ్రీమతి కే. ధనలక్ష్మి, శ్రీ జి. శివ ప్రసాద్, శ్రీమతి ఎం. నీరజ, శ్రీ జె. రామ సుబ్బయ్య, శ్రీ కె. రమేష్ రెడ్డి, శ్రీ ఎస్. అయూబ్ ఖాన్, శ్రీ ఎం. శ్రీనివాసులు, శ్రీమతి ఎస్. మహాలక్ష్మి, శ్రీ ఎన్. దస్తగిరి, శ్రీ కె. సురేష్ తదితరులు పాల్గొన్నారు.













