రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : కడప జిల్లాలో కీలక పట్టణమైన ప్రొద్దుటూరులో వరుస చోరీలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో భయం, ఆందోళన నెలకొంది. ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. వ్యక్తిగతంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా చోరీలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి, బీరువాల్లో దాచుకున్న బంగారం, నగదును అపహరించి క్షణాల్లో పరారవుతున్నారు.
ఫిబ్రవరి 22న పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో తాళం వేసి ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆ ఇంట్లో ఉన్న దాదాపు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ కేసును పోలీసులు ఛేదించలేకపోయారు.
గత నెల మే 29న పట్టణంలోని కొర్రపాడు రోడ్డులోని ఓ మిల్లులో మరో భారీ చోరీ జరిగింది. మిల్లులోని బీరువా తాళాలు ధ్వంసం చేసి అందులో ఉన్న దాదాపు రూ. 12 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినా, నిందితులు ఇంకా పోలీసులు చెరకు అందలేదు.
గతేడాదిలో కుడా నేతాజీనగర్‌లో ఒకే రాత్రి తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఆ ఇళ్లలో ఉన్న దాదాపు 14 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. నెలలు గడిచినా ఆ కేసులను పోలీసులు ఛేదించలేకపోయారు.
దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి, చోరీ చేయడానికి అనువైన ఇళ్లు, దుకాణాలను ఎంచుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో, అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత పథకం ప్రకారం ఆ ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడి వెళ్లిపోతున్నారు. తెల్లారే వరకు చోరీ జరిగిన విషయం స్థానికులకు తెలియకుండా పోతుంది.
ఈ కేసులను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. నిందితులను పట్టుకోలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో అనేక చోరీ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. సొమ్ములు, బంగారం పోగొట్టుకున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పోలీసులు గస్తీ బలగాలను పెంచి, చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇక పట్టణ ప్రజలు తాళం వేసి పొరుగు ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఇళ్ల భద్రత కోసం అదనపు తాళాలు, తలుపుల బలపరిచే పనులు, సీసీ కెమెరాలు వంటి చర్యలకు కూడా చాలా మంది మొగ్గుచూపుతున్నా, దొంగల బీభత్సం ఆగకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













