రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ప్రజా కేంద్రంగా వివిధ ప్రజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని మహిళా స్వశక్తి భవనంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సారథ్యంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ అఖండ ‘సేవా జ్యోతి’ దీపం వెలిగించారు. అనంతరం భరతమాతకు జై అంటూ నెలరోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో మహిళలను, ప్రజా ప్రతినిధులను, స్వచ్చంద సేవా సంస్థలను, ప్రజలను, పాఠశాల విద్యార్థులను సమన్వయం చేసుకొని స్వచ్ఛతపై సంపూర్ణ అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం దిగువస్థానంలో ఉన్నందున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడి దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా పరిసరాల శుభ్రత, స్వచ్చ హరిత వేడుకలు, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, స్వచ్చ సమృద్ధి, సఫాయిమిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమీషనర్ వివరించారు.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిగా అసిస్టెంట్ ఇంజనీర్ దస్తగిరిని నియమించినట్లు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.
కార్యక్రమంలో మెప్మా ఇంచార్జి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.













