రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో దొంగల బీభత్సం కొనసాగుతోంది. స్థానిక వై.ఎమ్.ఆర్. కాలనీలో ఉన్న ప్రసిద్ధ శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు హుండీ చోరీకి పాల్పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దేవాలయంలోనే ఇలాంటి దుశ్చర్య జరగడం స్థానికంగా కలకలం రేపింది.
ఆలయ నిర్వహకులు, భక్తుల తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలో దొంగతనాలు విపరీతంగా పెరిగాయి. గుడులు, బడులు, ఇళ్లు, అంగళ్లు మాత్రమే కాకుండా బ్రాందీ షాపులు, బార్లు, రెస్టారెంట్లు అనే తేడా లేకుండా వివిధ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారని వారు పేర్కొన్నారు.

తాజాగా ఇదే ధోరణిలో శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి ఆలయాన్ని కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి స్వామివారి హుండీని అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని కంప చెట్ల గుబురులోకి తీసుకెళ్లి హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు.
పూజా కార్యక్రమాలు, భక్తులు సమర్పించిన తక్షణల రూపంలో హుండీలో సుమారు ఒకటిన్నర లక్ష రూపాయలకుపైగా నగదు ఉండి ఉండొచ్చని ఆలయ నిర్వహకులు అంచనా వేస్తున్నారు. హుండీ పూర్తిగా ధ్వంసమైన స్థితిలో లభ్యమైందని, అందులోని మొత్తం నగదు దొంగిలించబడిందని వారు తెలిపారు.
ఈ ఘటనపై సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన ఆలయ నిర్వాహకులు నిరాశకు గురయ్యారు. గుడి ఎదురుగా ఉన్న ఓ ఇంటిలో అమర్చిన సీసీ కెమెరా పనిచేయకపోవడంతో ఆ దిశగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరో కెమెరాలో మాత్రం దొంగల కదలికలు కనిపించినప్పటికీ, వారి ముఖాలు స్పష్టంగా రికార్డు కాలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవాలయాల్లోనే ఇలాంటి దుశ్చర్యలు జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న ఆలయాల్లో హుండీలను కూడా దోపిడీ చేయడం ఆందోళనకర పరిణామమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ వరికుట్టి ఓబుల్ రెడ్డి, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. దొంగలను గుర్తించి పట్టుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.













