రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన దొంగతనం కేసును టూ టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 11 లక్షల 36 వేల 160 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పి విభూ కృష్ణ వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో రైతుల వద్ద నుండి చెనక్కాయలు కొనుగోలు చేసేందుకు 12 లక్షల 30 వేల రూపాయల నగదును మిల్లులో ఉంచారు. ఈ నగదు విషయం మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు తెలిసింది. అదే సమయంలో అక్కడే పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
దొంగతనం జరిగిన వెంటనే మిల్లులోని బాధితులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాలు, స్థానిక సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో మిల్లులో పనిచేస్తున్న కమ్మిగాళ్ల కిరణ్ కుమార్, దేవగుడి ఉత్తయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను ప్రశ్నించగా, వారు దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని, వారి వద్ద నుండి 11 లక్షల 36 వేల 160 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నగదు వినియోగంపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ కేసు వివరాలను అడిషనల్ ఎస్పి విభూ కృష్ణ, టూ టౌన్ సిఐ వంశీకృష్ణ, సిబ్బందితో కలిసి ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దొంగతనం జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి, నగదు తిరిగి సాధించడం టూ టౌన్ పోలీసుల అప్రమత్తతకు నిదర్శనంగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
కేసు నమోదు చేసి, నిందితులను న్యాయస్థానానికి హాజరుపరచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా మిల్లులు, వ్యాపార సంస్థలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.













