ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో జరిగిన తప్పిదాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార శాఖ అధికారి వెంకట సుబ్బయ్య ఆదేశించారు. బ్యాంక్ సీఈవో నిరంజన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

మంగళవారం వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌కు తనిఖీ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా బ్యాంక్ నిర్వహణ, రికార్డులు, ఖాతాదారుల వివరాల భద్రతపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. బ్యాంక్ రికార్డులు, ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను బయటకు చేస్తున్న వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష చూపకూడదని, వారిపై పోలీస్ కంప్లైంట్ నమోదు చేయాలని సీఈవో నిరంజన్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

బ్యాంక్‌లో భద్రతా వ్యవస్థల నిర్వహణపై కూడా DCO ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్, పాస్వర్డ్ వంటి కీలక భద్రతా అంశాలు సీఈవో వద్ద మాత్రమే ఉండాలని, ఇతరుల వద్దకు ఇవి వెళ్లకుండా చూడాలని ఆయన సూచించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ చర్యలతో బ్యాంక్‌లో పారదర్శకత, భద్రత మరింత బలోపేతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

బ్యాంక్ రికార్డులు, ఖాతాదారుల వివరాలు బయటకు రావడం చట్టపరంగా తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, సంబంధిత చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని DCO స్పష్టం చేసినట్లు తెలిసింది. బ్యాంక్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

జిల్లాలోని సహకార బ్యాంకులన్నింటిలోనూ రికార్డుల భద్రత, ఖాతాదారుల గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే ఇతర బ్యాంకుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని సహకార శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో జరిగిన ఈ తనిఖీతో, బాధ్యులపై చర్యలు తప్పనిసరి అవనున్నాయని బ్యాంక్ సిబ్బంది అంచనా వేస్తున్నారు.