ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్లపై, ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద ఇష్టారాజ్యంగా ద్విచక్ర వాహనాలు నిలిపివేత వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా పట్టణంలో పార్కింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు మున్సిపల్ అధికారులు ముందుకు వచ్చినట్లు సమాచారం.

ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను రోడ్డు మధ్యలో, అడ్డంగా నిలిపివేయడం వల్ల పాదచారులు, ఇతర వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించారు. దీనిపై కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ప్రత్యక్షంగా పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేసే వాహనాలపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా వాహనాలు నిలిపితే ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన స్పష్టం చేసినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి.

ప్రొద్దుటూరు పురపాలక సంఘం ప్రధాన రోడ్డులో అడ్డంగా నిలిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ద్విచక్ర వాహనాల టైరులలో గాలి దగ్గరుండి తీసివేయాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో అక్కడ నిలిపి ఉన్న పలువురు ద్విచక్ర వాహనాల టైరుల గాలి తీసివేయడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. ఇకపై రోడ్లను ఆక్రమించి వాహనాలు నిలిపితే ఇలాంటి చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కమిషనర్ చర్యలకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల ఆక్రమణలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల పట్టణంలో క్రమశిక్షణ నెలకొంటుందని, పాదచారులు, వాహనదారులు సౌకర్యంగా ప్రయాణించగలరని వారు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసు విభాగం సమన్వయంతో పట్టణంలో పార్కింగ్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.