రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్.ఓ.సి. నెం.13032/2/2026/H1-2, తేది 04.09.2026 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి తాజా షెడ్యూల్ ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు WP.No.15782/2026 మరియు బ్యాచ్ కేసులలో 03.09.2026 తేదీన ఇచ్చిన ఉమ్మడి ఉత్తర్వులకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టాలని ప్రభుత్వము ఆదేశించింది.
ప్రస్తుతం ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న 41 ఎలక్షన్ వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జి.ఓ.ఎం.స్. నెం.31 ప్రకారం అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీస్ (నగర పంచాయతీలు మరియు మునిసిపాలిటీలను వార్డులుగా విభజించడం) నియమాలలోని రూల్ నెం.4(i) ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించింది.
ఈ నియమాల ప్రకారం ఫారం నెం.1 నోటిఫికేషన్ కాపీని ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై 7 రోజులు పాటు ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు అధికారికంగా సమాచారం అందజేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫారం నెం.1, రూల్ నెం.4(1) నోటిఫికేషన్ కాపీని జిల్లా కలెక్టర్ కార్యాలయం కడప, రెవిన్యూ డివిజనల్ కార్యాలయం జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయం మరియు ప్రొద్దుటూరులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజల పరిశీలన, సలహాల కోసం ఉంచారు.
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు తమ సలహాలు, సూచనలను వ్రాతపూర్వకంగా సిద్ధం చేసి, తేది 11.09.2026 లోపు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయానికి సమర్పించాల్సిందిగా కోరారు. వార్డుల పునర్విభజనపై ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు చురుకుగా పాల్గొని, తమ ప్రాంతాల వార్డుల విభజనపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని పురపాలక సంఘం కమిషనర్ ప్రజలను కోరారు.
కమీషనర్, ప్రొద్దుటూరు పురపాలక సంఘం.













