రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : కుళాయి పన్ను వసూలుపై నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో వార్డు మౌలిక సౌకర్యాల కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో అధికారికంగా 24 వేల 146 కుళాయిలు నమోదై ఉన్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కుళాయి పన్నుల రూపంలో పురపాలక సంఘానికి సుమారు 3 కోట్లు జమ కావాల్సి ఉంటుందని, అయితే సిబ్బంది నిర్లక్ష్యం, మొండి బకాయిదారుల కారణంగా ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 24 లక్షల రూపాయల అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

ప్రొద్దుటూరు పట్టణంలో 13 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయిర్ ఉన్నాయని, పంపు ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు, ఫిట్టర్లు తదితరంగా సుమారు 95 మంది సిబ్బంది నిరంతరం వాటర్ వర్క్స్ సెక్షన్‌లో సేవలందిస్తున్నారని కమీషనర్ పేర్కొన్నారు. వీరి జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం పురపాలక సంఘం అధిక మొత్తంలో వ్యయం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అర్థం చేసుకొని కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి కుళాయి పన్నుల రూపంలో బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుతో కలిపి సుమారు 5 కోట్ల రూపాయల వరకు పెరిగినట్లు కమీషనర్ తెలిపారు. ఈ బకాయిలు వసూలు చేయడానికి సెప్టెంబర్ 7 నుండి 11 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ స్పష్టం చేశారు.
పన్నులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. కుళాయి పన్ను వసూలు ప్రత్యేక డ్రైవ్ సమయంలో ప్రతి వార్డు స్థాయిలో లక్ష్యాలు నిర్ధేశించి, వాటి అమలుపై రోజువారీగా సమీక్ష చేయాలని సూచించినట్లు సమాచారం.
సమీక్షా సమావేశంలో వాటర్ వర్క్స్ ఏఈ కె సురేంద్రనాధ్ రెడ్డి, ఏఈ ఎన్. దస్తగిరి, ఏఈ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.













