వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈవీ సుధాకర్ రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఈవీ సుధాకర్ రెడ్డి స్పందించారు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తనను లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఈవీ సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. దాదాపు 30 ఏళ్లుగా అన్ని రాజకీయ పక్షాల నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

తన రాజకీయ బలం గురించి రాచమల్లు పూర్తిగా తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో స్వయంగా తన బావమరిదితో కలిసి ఇంటికి వచ్చి మద్దతు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ అధిష్ఠానం తనకు కేటాయించిన మూడు బూతులలో తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఆధిక్యం తెచ్చిపెట్టామని, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విజయానికి నిబద్ధతతో శ్రమించామని వివరించారు.

టౌన్ బ్యాంక్ వివాదానికి సంబంధించి వాస్తవాలను వెల్లడిస్తూ బాధితులకు ఇప్పటికే కోటి రూపాయలకు పైగా నగదును విడతలవారీగా ఇప్పించి న్యాయం చేశామని ఈవీ సుధాకర్ రెడ్డి తెలిపారు. కేవలం పరిచయం ఉండటం వల్లే ఖాతా ప్రారంభించే సమయంలో ఇంట్రడక్షన్ సంతకం చేశానే తప్ప, ఆ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

సంబంధిత ఖాతాదారులు స్వయంగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్నారని, తాను బ్యాంకు వద్దకు కూడా వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. తనకు ఏవైనా అప్పులు ఉంటే వడ్డీతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, గతంలో రాచమల్లు వైఖరి నచ్చకే తాను, ముక్తియార్ తదితర నాయకులు బయటకు వచ్చామని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో రాచమల్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా పార్టీ గెలుపు కోసమే పనిచేస్తానని ఈవీ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాచమల్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ వ్యవహారంపై కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధమని తెలిపారు.

టౌన్ బ్యాంక్ లావాదేవీలలో తన ప్రమేయం ఉన్నట్లు ఏ కోశానైనా నిరూపిస్తే తన రాజకీయ జీవితాన్ని, న్యాయవాద వృత్తిని త్యజించడంతో పాటు సర్వ ఆస్తులను రాచమల్లు పేరిట రాసిచ్చి ప్రొద్దుటూరును విడిచి వెళ్లిపోతానని ఈవీ సుధాకర్ రెడ్డి శపథం చేశారు.

రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారాలకు తెరపడాలంటే సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి టౌన్ బ్యాంక్ అంశంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.