రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తాను ఎప్పుడూ ప్రతి ఒక్కరినీ గౌరవించే వ్యక్తినని, ఎవరి పట్లనూ అమర్యాదగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
చేనేత కార్మికులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని నంద్యాల రాఘవరెడ్డి ఆరోపించారు. రాచమల్లు ఆరోపణల్లో వాస్తవం ఉంటే చౌడేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీసీల ఓట్లు దూరమవుతాయన్న భయంతోనే తనతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై రాచమల్లు బురదజల్లుతున్నారని ఆయన విమర్శించారు.
తాను మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేయడం లేదని నంద్యాల రాఘవరెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న విమర్శలు కేవలం పాత నేరాలు, హత్యారోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని పేర్కొన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పటికైనా హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.
ఈ సమావేశం అనంతరం నాయకులు రాజువారి వెంకటసుబ్బయ్య మాట్లాడారు. చెన్నమరాజుపల్లెలో గతంలో కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు జరిగిన విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం రెండు కుటుంబాలూ సామరస్యంగా ఉంటూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాయని చెప్పారు.
గత పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం తగదని రాజువారి వెంకటసుబ్బయ్య అభిప్రాయపడ్డారు. గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొన్న సమయంలో పాత సంఘటనలను వక్రీకరించి ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.
ఈ మీడియా సమావేశంలో మార్కెట్ యార్డ్ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా స్థానిక రాజకీయ పరిణామాలు, చెన్నమరాజుపల్లె గ్రామ పరిస్థితులపై నాయకులు పరస్పరం చర్చించుకున్నారు.













