రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు టౌన్ రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ భూముల వేలంపాటను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రౌడీషీటర్ పాతకోట వినోద్ కుమార్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.
ఆలయ ఈవో శ్రీధర్ అభ్యర్థన మేరకు వేలంపాట సందర్భంగా చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రొద్దుటూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టూరిజం బిల్డింగ్ వద్ద ఆలయ భూముల వేలంపాట జరుగుతున్న సమయంలో దొరసాని పల్లికి చెందిన రౌడీషీటర్ వినోద్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకుని వేలంపాటను ఆపాలని ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
వేలంపాట నిర్వహించరాదని పట్టుబట్టిన వినోద్ కుమార్ రెడ్డి, అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దస్తగిరి సహా ఇతర పోలీసు సిబ్బందిపై దుర్భాషలాడుతూ తోసిపుచ్చినట్లు సమాచారం. పోలీసులు హెచ్చరించినా అతడు ఆగకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులకు ఎంత వారించిన వినకుండా వేలంపాటను ఆపాలని, లేకపోతే చూస్తానని బెదిరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ ఈవో శ్రీధర్ పై దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో, అక్కడే ఉన్న పెద్ద బండరాయితో హెడ్ కానిస్టేబుల్ దస్తగిరిపై దాడి చేయడానికి యత్నించినట్లు తెలిసింది. అయితే హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తంగా తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తర్వాత పోలీసులు వెంటనే స్పందించి రౌడీషీటర్ వినోద్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే ప్రొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనలో బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి, పోలీసులపై దాడి చేసినందుకు వినోద్ కుమార్ రెడ్డి పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా రౌడీషీటర్స్ శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన ఎడల వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించడమైనది.
ఇట్లు ఇన్స్పెక్టర్ ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్













