ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లి ప్రాంతం, వార్డు 16లో నివసిస్తున్న నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల పాప పుట్లూరు పద్మకు 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. మల్టీపుల్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఈ పాప పుట్టిన నాటి నుంచి మంచానికే పరిమితమై ఉంది. కూర్చోలేని, నిలబడలేని స్థితిలో మెంటల్‌గా కూడా వెనుకబాటుతనంతో అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తోంది. తల్లి రామలక్ష్మి, తండ్రి రామాంజనేయులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ బాడుగ ఇంట్లో ఈ కుటుంబం జీవిస్తోంది.

ఈ కుటుంబానికి ప్రధాన సమస్య ఆధార్ కార్డు లేకపోవడం. ఆధార్ లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఎన్నో సంవత్సరాలుగా అందడం లేదు. ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీయుత వరదరాజుల రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో పద్మ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించారు. కుటుంబ సంక్షేమంపై వివరాలు తెలుసుకునే క్రమంలో ఆధార్ కార్డు సమస్య కారణంగా ప్రభుత్వ సహాయం అందడం లేదని ఆయన దృష్టికి వచ్చింది.

సమస్య ఉంటే స్పందించి పరిష్కారం వచ్చే వరకు నిద్రపోని నాయకుడిగా పేరున్న వరదరాజుల రెడ్డి, వెంటనే జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. నిరుపేద ఎస్సీ కుటుంబానికి భరోసా ఇస్తూ, తన కారులో స్వయంగా పాపను తీసుకెళ్లి ఆధార్ నమోదు చేయిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం పాప పద్మ విషయాన్ని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లి, తక్షణమే ప్రభుత్వ సహాయం అందేలా, ఆధార్ నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎం.ఎల్.ఎ ఆదేశాల మేరకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తన సిబ్బందితో కలిసి మోడంపల్లి పద్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేశారు. విచారణలో పద్మకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందాల్సిన సేవలు కూడా అందడం లేదని కమిషనర్ గుర్తించారు. దీనిపై సిబ్బందిపై తీవ్రంగా స్పందించిన ఆయన, అంగన్వాడీ టీచర్‌ను వెంటనే పిలిపించి, అంగన్వాడీ కేంద్రంలో పద్మను చేర్పించారు.

పద్మకు ఆధార్ కార్డు లేదని తెలిసిన కమిషనర్, జిల్లా కోఆర్డినేటర్ నవీన్‌తో మాట్లాడి రెండో శనివారం సెలవు రోజు అయినప్పటికీ ఆధార్ నమోదుకు అనుమతి కోరారు. యుడిఐ నుంచి మాత్రమే అనుమతి లభిస్తుందని నవీన్ సమాచారం ఇవ్వడంతో, రాష్ట్ర స్థాయి యుడిఐ కోఆర్డినేటర్ జావీద్‌తో కమిషనర్ మాట్లాడి, పద్మ కేసు అత్యంత ప్రత్యేకమని వివరించి ఆధార్ నమోదుకు ప్రత్యేక అనుమతి పొందారు.

తర్వాత కమిషనర్ స్వయంగా తన కారులో పద్మ కుటుంబ సభ్యులను ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లి, సుమారు నాలుగు గంటలపాటు అక్కడే ఉండి నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. మల్టీపుల్ డిజార్డర్ కారణంగా బయోమెట్రిక్, ఐరిస్, ఫోటో ఐడెంటిటీ కాప్చరింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక దశలో సిబ్బంది చేయలేమని వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చినా, కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ ప్రోత్సాహంతో సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి చివరకు పద్మకు ఆధార్ నమోదు పూర్తి చేశారు.

ఎం.ఎల్.ఎ వరదరాజుల రెడ్డి చొరవతో ఈ నిరుపేద ఎస్సీ కుటుంబానికి ఆధార్ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అంతటితో ఆగకుండా, పద్మకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్‌కు వరదరాజుల రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

ఈ పరిణామంతో రామలక్ష్మి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యను తీర్చిన వరదరాజుల రెడ్డి‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. విధేయతగా ఉంటామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 7 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను ఎం.ఎల్.ఎ ఆదేశాల మేరకు స్వయంగా పరిష్కరించిన కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ను వరదరాజుల రెడ్డి అభినందించారు. కమిషనర్ స్థానికుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కానీ అధికారులకు, సిబ్బందికి మనవీయ కోణం ఉంటే ప్రభుత్వ సేవలను ప్రజల్లో మరింత విస్తరించవచ్చని తెలిపారు. దానికి ప్రొద్దుటూరు పురపాలక సంఘం కట్టుబడి ఉందని కమీషనర్ పేర్కొన్నారు.