ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలి, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ప్రొద్దుటూరులో ప్రజా సంఘాల నిరసన

ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, ఎన్నికల కమిషన్ చైర్మన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాయి. స్థానిక శివాలయం సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు.

దేశవ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ద్వారా 13 కోట్లకు పైగా భారత పౌరుల ఓటు హక్కును ఎన్నికల కమిషన్ హరించిందని నిరసనకారులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం అవినీతి ఆరోపణలు ఉన్న జ్ఞానేష్ కుమార్‌ను ఎన్నికల కమిషన్ చైర్మన్‌గా నియమించి, చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకొని, గిట్టని ఓట్లను తొలగించే దుర్మార్గానికి పాల్పడుతోందని వారు విమర్శించారు.

ఈ చర్యలకు వ్యతిరేకంగా దేశ యువత, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగిందని నాయకులు పేర్కొన్నారు. వేలమంది కార్యకర్తలను అరెస్టు చేయడం, రైళ్లను నిలిపివేయడం, పోలీసు, పారా మిలిటరీ బలగాలతో పాటు సరిహద్దు ప్రాంతాల నుండి బలగాలను కూడా దేశ రాజధానిలో మోహరించడం ద్వారా ప్రజా నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించిందని వారు అన్నారు.

ప్రశ్నిస్తున్నందుకు, అక్రమాలను నిలదీస్తున్నందుకు ప్రజలపైనే ప్రభుత్వం యుద్ధానికి దిగిందని నిరసనకారులు అభిప్రాయపడ్డారు. ప్రజా నిరసనలపై ప్రభుత్వ దుర్మార్గాన్ని ఖండిస్తూ, ఎస్ ఐ ఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన సందర్భంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు ఈ క్రింది డిమాండ్లను ఉంచారు:

1. ఇప్పటివరకు జరిగిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలి.

2. జ్ఞానేష్ కుమార్ స్వయంగా రాజీనామా చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని రీ కాల్ చేయాలి.

3. ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించే కమిటీలో కేంద్ర క్యాబినెట్ మంత్రి స్థానంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని చేర్చేలా చట్ట సవరణ చేయాలి.

4. ఎన్నికల కమిషన్ సభ్యులు ఏం చేసినా కేసులు పెట్టకుండా ఉండే రక్షణను వెంటనే తొలగించాలి.

5. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఇప్పటిదాకా జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి.

6. అక్రమంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి.

ఈ కార్యక్రమానికి సురేష్ పవర్ హక్కుల సంఘం నుండి అధ్యక్షత వహించారు. CPI నుండి రామయ్య , సుబ్బారాయుడు , CPM నుండి సత్యం , విజయకుమార్ , జమాతే ఇస్లాం నుండి షఫీ అల్లాహ్ , రహ్మతుల్లాహ్ , మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నుండి హుస్సీన్ బాషా , స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ అఫ్ గర్ల్స్ నుండి మరియా , స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ నుండి షఫీ , AIDWA నుండి ముంతాజ్ , వరలక్ష్మి విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, శ్రీనివాసులు రెడ్డి , నాగేంద్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య , రెహానా , అయేషా జమాతే ఇస్లాం మహిళ విభాగం, ఎల్లయ్య దళిత సమాఖ్య , హరిత అడ్వకేట్ , వడ్ల లక్ష్మీదేవి , గాయత్రీ , మాధవి రాయలసీమ మహిళా శక్తి , రషీద్ , మహమూద్ , జగదీశ్ , Ismail, డర్బన్ , జావేద్ రాయలసీమ విద్య వంతుల వేదిక , పద్మ , గౌసియా చైతన్య మహిళా సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.