రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రొద్దుటూరు వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. స్టేషన్లలో విధుల నిర్వహణ, రికార్డుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై ఆయన సమగ్రంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వన్ టౌన్, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణకు, స్టేషన్ పరిసరాల హరితవనానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు సిబ్బందికి సూచించినట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్లలోని రికార్డులు, స్టేషన్ పరిసరాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పాత నేరస్థులు, సస్పెక్ట్‌ల కార్యకలాపాలపై నిఘా మరింత బలోపేతం చేయాలని సంబంధిత స్టేషన్ అధికారులకు సూచించారు. నేర నియంత్రణలో ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో జిల్లా ఎస్పీ మాట్లాడి, వారికి కేటాయించిన బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. వృత్తిపరమైన సమస్యలేమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రానున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ, వార్డ్ స్థాయిలో పోలీస్ సిబ్బందిని నియమించి, క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించుకుంటూ ప్రశాంత, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం కావాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ల సి.ఐలు, ఎస్.ఐలను ఆదేశించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్ల (VPO) విధుల గురించి ఆరాతీసి వారికి పలు సూచనలు చేశారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్లో నైట్ హాల్ట్ చేయాలని కూడా సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తదితర నేరాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా డే బీట్‌లు, నైట్ బీట్‌లు పెంచాలని, అనుమానాస్పదంగా తిరిగే వారిని విచారించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.













