ప్రొద్దుటూరు: కేవలం 10 సెంట్ల భూమికి సంబంధించిన అభ్యంతరం కారణంగా వందలాది ఎకరాల రైతులకు సాగునీరు నిలిపివేయడం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాలమాపురం గ్రామంలో సాగునీటి కాలువను పూడ్చివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆయన రైతులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్పీ శ్రీకాంత్‌తో మాట్లాడారు.

బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందుతోందని రాచమల్లు తెలిపారు. మెయిన్ కనాల్, సబ్ కెనాల్స్, పంట కాలువల ద్వారా రైతులు తమ పొలాలకు నీటిని తీసుకుంటున్నారని వివరించారు. ఈ కాలువలను మూసివేస్తే దిగువ ప్రాంతాలలోని దాదాపు 300 ఎకరాల సాగునీటికి ముప్పు ఏర్పడుతుందని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలని రాచమల్లు కోరారు. ఒక్క రైతు భూమికి అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవచ్చని, నష్టపరిహారం ఇవ్వడం లేదా భూమిని కొనుగోలు చేయడం వంటి మార్గాలను పరిశీలించాల్సిందే తప్ప వందలాది రైతుల సాగునీటిని నిలిపివేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ విషయంలో కొందరు టీడీపీ నాయకులు కాలువ మూసివేతకు మద్దతు ఇస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా వారికి అండగా నిలుస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. రైతుల పంటలు, గ్రామాల ప్రశాంతతకు భంగం కలిగించేలా రాజకీయాలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

పంట కాలువలపై రాజకీయాలు చేస్తే చరిత్ర క్షమించదు. రైతుల పంటలు, గ్రామాల ప్రశాంతత కంటే రాజకీయాలు పెద్దవి కావు

అని హెచ్చరిస్తూ, కాలువకు నష్టం జరిగితే రైతులతో కలిసి బైఠాయిస్తామని రాచమల్లు స్పష్టం చేశారు. తాలమాపురం ప్రాంతంలో సాగునీటి కాలువపై ఏర్పడిన వివాదాన్ని తక్షణం పరిష్కరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పి.ఆర్.రెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, దేవిప్రసాద్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాలువ మూసివేతకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, సాగునీటి సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.