ప్రొద్దటూరు: తెలుగు సబ్జెక్టులో పూర్తి మార్కులు సాధించడం చాలా అరుదుగా కనిపించే విషయం. గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో 100 మార్కులు సాధించే విద్యార్థులు ఎక్కువగా కనిపించినా, తెలుగు విషయంలో సాధారణంగా 98, 99 మార్కులకే పరిమితమవుతుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండు సంవత్సరాలు తెలుగులో 100/100 మార్కులతో ఆరుగురు విద్యార్థులు ‘సూపర్ సిక్స్’లు సాధించడం ప్రొద్దుటూరు ఉపాధ్యాయుడు గంగాధర్ నాయుడు బోధన పద్ధతికి నిదర్శనంగా నిలిచింది.

ప్రొద్దుటూరు లోని SPCN పురపాలక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గంగాధర్ నాయుడు, బదిలీల కారణంగా పాఠశాలలు మారినా, తన బోధన ఫలితాల్లో మాత్రం అదే స్థాయి కొనసాగించారు. 2024–25 విద్యా సంవత్సరంలో తాను పనిచేసిన పూర్వ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు తెలుగులో 100/100 మార్కులు సాధించారు. 2025లో బదిలీపై ప్రస్తుత పాఠశాలకు వచ్చిన తర్వాత కూడా మరోసారి ఆరుగురు విద్యార్థులు తెలుగులో పూర్తి మార్కులు సాధించడం గమనార్హం.

ప్రస్తుత పాఠశాల విద్యార్థుల్లో ఇద్దరు జిల్లా స్థాయిలో 587 మార్కులు సాధించి, జిల్లా టాప్ టెన్ జాబితాలో 6, 7 స్థానాలు దక్కించుకున్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకుంది.

సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ బోధించడం గంగాధర్ నాయుడు ప్రత్యేకత. విద్యార్థులు విన్న విషయాన్ని త్వరగా మరచిపోతారు, కానీ చూసిన విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని విజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పాఠ్యాంశానికి అనుగుణంగా చిత్రాలు, దృశ్యాలను జోడిస్తూ బోధనను సులభంగా, ఆసక్తికరంగా మార్చారు.

తన తరగతి గది విద్యార్థులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ద్వారా పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు దాదాపు పది లక్షలకు పైగా వీక్షణలు నమోదు కాగా, సుమారు 8 వేల మంది సబ్స్క్రైబర్లు ఉండడం గమనించదగిన విషయం.

దీక్ష ఆప్‌లో కూడా 100కు పైగా వీడియో కంటెంట్లు అప్లోడ్ చేసి, పాఠ్యపుస్తకాలలో ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేసి విద్యార్థులకు పాఠాలను అందించే విధంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్‌గా, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ సాంకేతికత వినియోగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఏడవ తరగతి, పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల రూపకల్పనలో సాంకేతిక నిపుణుడిగా, పాఠ్యపుస్తక రచయితగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో స్టేట్ రిసోర్స్ పర్సన్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్‌గా, DCEB మెటీరియల్ రూపకర్తగా, కెరీర్ గైడెన్స్ మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మునిసిపల్ డైరెక్టర్ కన్నబాబు IAS చేతుల మీదుగా అభినందనలు అందుకున్నారు. ఇప్పటివరకు ఐదుగురు జిల్లా కలెక్టర్ల నుంచి ప్రశంసలు పొందారు.

2018లో ఢిల్లీలో జరిగిన ICT సెమినార్‌లో పాల్గొని, బోధనలో సాంకేతికత అవసరంపై ప్రదర్శన ఇచ్చారు. గత 26 సంవత్సరాలుగా ఎక్కడ పనిచేసినా అక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమన్వయం, సహకారం, సమిష్టి కృషితో ఆ పాఠశాలల్లో అద్భుత ఫలితాలు సాధించడం గంగాధర్ నాయుడు బోధన పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.