రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో TNSF ఆధ్వర్యంలో నిర్వహించిన UG, PG విద్యార్థుల క్రికెట్ టోర్నమెంట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. నాలుగు రోజులపాటు సాగిన ఈ టోర్నమెంట్‌లో స్థానిక కాలేజీల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బుధవారం ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించగా, ఉత్కంఠభరితంగా జరిగిన తుది పోటీల అనంతరం విజేతలను ప్రకటించారు. ప్రొద్దుటూరు YVU ఇంజినీరింగ్ కాలేజీ జట్టు మొదటి బహుమతిని గెలుచుకోగా, SRIT ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల జట్టు ద్వితీయ బహుమతిని సాధించింది.

ఫైనల్ పోటీలు ముగిసిన అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో విజేత జట్లకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. టీడీపీ నేతలు భూపేశ్, ముక్తియార్, కొండారెడ్డి, పట్నం లక్ష్మణ్ కుమార్ పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు.

ఈ టోర్నమెంట్ ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, జట్టు భావన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన పోటీల్లో పలు జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి.
ప్రొద్దుటూరులో యువతకు క్రీడా అవకాశాలు కల్పించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని స్థానిక క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో నిర్వాహకులతో పాటు పాల్గొన్న జట్లు, ప్రేక్షకులు సహకారం అందించారు.













