ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూల నజీర్, ఆయన కుమారుడు జావీద్‌పై జరిగిన దాడి ఘటనలో నిందితులను చట్టపరంగా శిక్షించి, నజీర్‌కు న్యాయం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి మంగళవారం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభు కృష్ణకు విజ్ఞప్తి చేశారు.

గత ఆదివారం ప్రొద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలోని వై జంక్షన్ వద్ద షాషా అనే వ్యక్తి, జెబిల్ అనే వ్యక్తి మధ్య వ్యాపార సంబంధంగా వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై మధ్యవర్తిత్వం చేయడానికి, పెద్దమనిషిగా పూల నజీర్ తన కుమారుడు జాబీద్‌తో కలిసి అక్కడికి వెళ్లారు.

అక్కడికి చేరుకున్న వెంటనే షాషా అనుచరులు విచక్షణారహితంగా రాళ్లతో పూల నజీర్‌పై, ఆయన కుమారుడు జాబీద్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో పూల నజీర్, ఆయన కుమారుడు జావీద్ తలకు గాయాలు అయ్యాయి. ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషయం తెలిసిన డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో ఏఎస్పీ విభు కృష్ణను కలిసి జరిగిన పరిణామాలను వివరించారు. నజీర్‌కు న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన నిందితులను చట్టపరంగా శిక్షించాలని ఆయన ఏఎస్పీని కోరారు.

ఏఎస్పీ విభు కృష్ణను కలిసి జరిగిన ఈ సమావేశానికి పూల నజీర్, ఆయన కుమారుడు జావీద్‌తో పాటు గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాముల బ్రహ్మానంద రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ అడ్వకేట్ జిలాని భాష, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, చిన్నకోట్ల నాగరాజు హాజరయ్యారు.

దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నజీర్‌కు న్యాయం జరిగేలా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి.