రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ప్రొద్దుటూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ, విద్యుత్, రహదారులు, సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. ప్రజలు సమర్పించిన అర్జీలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ప్రతి సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు క్షేత్రస్థాయిలో పారదర్శకమైన, జవాబుదారి పాలనను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాయకులు వివరించారు.
ప్రత్యేకంగా ప్రజా దర్బార్ రోజున మాత్రమే కాకుండా ప్రతిరోజు మా కార్యాలయంలో నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. నిత్యం వందలాది మంది ప్రజలు తమ సమస్యలను తీసుకుని కార్యాలయానికి వస్తుంటారు.
సమస్యలను ఓపికగా విని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము.
ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతోనే ప్రతి ప్రజా దర్బార్ నందు పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వచ్చి వినతులు అందజేస్తున్నారు.
ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చిన ప్రతి వినతిని నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపిస్తూ, పరిష్కారం పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. ప్రజా దర్బార్ ద్వారా గ్రామ, పట్టణ స్థాయిలో ఉన్న చిన్నా, పెద్దా సమస్యలను వెలికితీసి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, TDP కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, TDP పట్టణ మాజీ అధ్యక్షులు ఇవి సుధాకర్ రెడ్డి, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్‌కు హాజరైన ప్రజలు తమ సమస్యలను వివరంగా తెలియజేసి, పరిష్కారం కోసం అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరారు.













