రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని నేతాజీ నగర్ 2వ వీధిలో వినాయక చవితి వేడుకలలో భాగంగా శుక్రవారం శ్రీ గజముఖ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళల కోసం రంగవల్లుల (ముగ్గుల) పోటీలు నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు ఉత్సాహంగా స్పందించారు.
ఈ ముగ్గుల పోటీలలో సుమారు 45 మంది మహిళలు పాల్గొన్నారు. పాల్గొన్న మహిళలు వేసిన ముగ్గులు, రంగవల్లులు ఆకర్షణీయంగా ఉండి వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ముగ్గులోనూ సృజనాత్మకత, శ్రద్ధ స్పష్టంగా కనిపించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ముగ్గుల పోటీలకు న్యాయనిర్ణేతలుగా మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ సతీమణి తూతిక శైలజ, మెప్మా అధికారి మహాలక్ష్మి బాధ్యతలు నిర్వర్తించారు. పోటీలో పాల్గొన్న మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు అర్హులను ఎంపిక చేశారు.
ఎంపికైన విజేతలకు శనివారం మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహిళలను ప్రోత్సహించేలా ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పండుగకు మరింత అందం చేకూరుతోందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా తూతిక శైలజ, మహాలక్ష్మి వినాయక చవితి సందర్భంగా మహిళల కోసం రంగవల్లుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు సామాజికంగా కూడా మంచి సందేశాన్ని ఇస్తాయని వారు అన్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీ గజముఖ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రవళిక రేష్మ లక్ష్మి కృషి చేశారు. పోటీల నిర్వహణ, పాల్గొన్న మహిళల సమన్వయం, బహుమతుల ఏర్పాటులో కమిటీ సభ్యులు చురుకుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలతో నేతాజీ నగర్ ప్రాంతం పండుగ సందడితో కళకళలాడింది.













