రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల వేడుకలు భక్తి, శ్రద్ధల పరిమితులను దాటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఉత్సవాల పేరుతో మితిమీరిన డీజే సౌండ్, అశ్లీల డ్యాన్సులు, ట్రాఫిక్ సమస్యలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. శాంతిభద్రతలు, పోలీసు నిబంధనలను పట్టించుకోకుండా ఉత్సవ కమిటీలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని కొన్ని వినాయక మండపాల వద్ద ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడేసి భారీ డీజే సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసి చెవులు చిల్లులు పడేంత శబ్దంతో హోరెత్తిస్తున్నారు. అదుపు తప్పిన ధ్వని కాలుష్యంతో వృద్ధులు, చిన్న పిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారు తీవ్ర భయంతో రోజులు గడపాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. చట్టాలు, పోలీసుల ఆదేశాలు తమకు లెక్కేలేదన్నట్లుగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని ప్రొద్దుటూరు నివాసులు మండిపడుతున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల పేరిట వినాయక మండపాల వద్ద జరుగుతున్న ప్రదర్శనలు కూడా వివాదాస్పదంగా మారాయి. భక్తి భావాన్ని చాటాల్సిన వేదికలపై సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెట్టి అశ్లీల డ్యాన్సులు ప్రదర్శిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. "లే రాజా లే", "ఇప్పటికింకా నా వయసే 16" వంటి ఆకతాయి పాటలకు అర్ధనారీశ్వరులు, డ్యాన్సర్లతో వికృత విన్యాసాలు చేయిస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది.
ఈ ప్రదర్శనల సమయంలో మధ్యం సేవించిన కొంతమంది యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, డ్యాన్సర్లపై పడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది గణేష్ ఉత్సవమా, లేక భోగం మేళమా అన్న సందేహం కలిగేలా పరిస్థితి మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్సవాల రచ్చతో ప్రొద్దుటూరు పట్టణంలో రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోతోంది. వినాయక మండపాల చుట్టుపక్కల రహదారులపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యవసర సేవల వాహనాలకు కూడా దారి లేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా అడ్డుకట్ట వేసే నాథుడే కనిపించడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ తరహా వికృత చేష్టల వల్ల హిందూ సంప్రదాయాల విశిష్టత తీవ్రంగా దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మితిమీరిన డీజే శబ్దాలకు, అశ్లీల బ్రేక్ డ్యాన్సులకు చెక్ పెట్టాలని ప్రొద్దుటూరు ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్సవాల పేరుతో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టి, భక్తి, సంస్కృతి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.













